Friday, April 19, 2024

రఘుప్రవరు చరితము రాజముఖీ సఖీ వినవే

 రఘుప్రవరు చరితము రాజముఖీ సఖీ వినవే - అధ్యాత్మ రామాయణ కీర్తన - సుందర కాండ 


రఘుప్రవరు చరితము రాజముఖీ సఖీ వినవే ॥రఘు॥

అనుపల్లవి:

అఘప్రహారియౌ హనుమంతుఁ డవనిజాతకు నమస్కరించి వన-

విఘట్టనమునకుఁ గాని కాదు సురవిపక్షుని సమక్షమనుచుఁ దలఁచె ॥రఘు॥


చరణములు:

ఫలములు డుల్చి విరుల్‌ రాల్చి తరుపంక్తులుఁ బడఁగూల్చి యళి-

కులము జోపి పెరలు రేపి వాపీకూపజలముల యడుసుపైకిఁ దేల్చి

అల చిత్తరువు మేడ మరుత్తనయుఁ డాగ్రహమునఁ దన్ని నేలఁగలిపిన

కెలమి వారు రావణుని కెఱిఁగింపఁ గెరలి లక్ష రాక్షసభటులఁ బనిచె ॥రఘు॥


దండిమగలు గండుమిగిలి రాఁ గని గుండెలగల నార్చి గదా-

దండము గొని ఖండించె నగచరాఖండలుఁ డదివిని యమరారి పేర్చి

మండిపడి పంచసేనాధిపతులఁ జండకోపకాండ చాపధరులై

దండనాథులేవురు రాఁ గపి జముదండ కనిచె వారి రావణుండులికె ॥రఘు॥


దశముఖుఁడు సప్తమంత్రికుమారులఁ దగు వీరులఁ బంప వా

రసమశూలభిండివాలకరవాలాది సాధనముల ననిలజు నొంప

నసమానబలాఢ్యుఁడై యేడ్వురను గసిమసంగి తోరణస్తంభమున

వెసనుండె హతశేషుల వలన విని యసురేంద్రుఁ డక్షకుమారు ననిచె ॥రఘు॥


కరులు హరులు నరదములు భటు లసంఖ్యాతము లేతేర బం-

ధురకృపాణ తనుత్రాణసబాణతూణధనుర్ధరుఁడై యేపు మీఱ

నరిదివీరుఁడన నేఁగి యక్షుఁడు శరముల నొంప మారుతి యలిగి ము-

ద్గరముచే వ్రేసి యతనిఁ జంపి సైన్యమును ద్రుంచె రావణుఁడదియు వినె ॥రఘు॥


కనుల నశ్రుకణములు నెలుఁగున గద్గదిక యడరఁగాను రా-

వణుఁ డింద్రజిత్తు గని గజిబిజిగా వానరుఁడొకఁ డింతఁ జేసితేను

కని సహించుటెట్లు వానిఁ జంపెదననిన దేవ నీవు బోవనేటికి

వనచరుని బట్టి దెత్తు నిచటికని చనియె మేఘనాథుఁడు సేనతో ॥రఘు॥


వాలుబెలుకు గద విల్‌తూపుల వజ్రాలజోడు దాల్చి ర-

త్నాల సౌరుదేరు తేరు ధీరోన్నతినెక్కి చని సామీరి నదల్చి

వాలమ్ములైదెనిమిదాఱునొకటి ఫాలహృదయపదవాలమున నసుర

గీలింపఁ గనలి గరుడుఁడన నెగసి కీశవిభుఁడు గూల్చె రథరథ్యముల ॥రఘు॥


ఎంతవాఁడు వీఁడని వేఱొక తేరెక్కి బ్రహ్మాస్త్రము దనుజ-

కాంతుఁడేయ యంత డాసి యతిధీమంత హనుమంతు బంధించె క్షణము

సంతతమెవనిఁ బేర్కొనిన జనుల జ్ఞానకర్మబంధములూడి ముక్తి

గాంతురట్టి శేషగిరీశుఁడగు రాఘవదాసుని కితరబంధములెంత ॥రఘు॥


No comments:

Post a Comment