నారీమణీ వినవే యీ కథాసరణి - అధ్యాత్మ రామాయణ కీర్తన - సుందర కాండ
రాగం: వరాళి
నారీమణీ వినవే యీ కథాసరణి ॥నారీమణీ॥
అనుపల్లవి:
ఆ రాక్షసేశ్వరుపట్టి పట్టి తేరఁ గట్టుఁబడవచ్చువాని య-
ధీరాత్మునివలెఁ బురము గనువాని వీరహనుమంత్రు గ్రుద్దుచుఁ
బౌరులు చేరిరా బ్రహ్మాస్త్ర మొకలక్షణము తనువంటి చనుట
వీరుఁడెఱిగియు గార్యగౌరవముచే నూరక జనియెఁ
బేరోలగమున నున్న దనుజవిభునెదుట రావణి యిడె నతని ॥నారీమణీ॥
చరణములు:
పూని బ్రహ్మాస్త్రమునఁ గట్టుబడె వీఁడు మానులు విఱిచె
వీనిచే దనుజుల్ కారాకులు గాలిచే నొరలు గతిఁబడి రనేకులు శాస్తి
వీనికెయ్యదియో వివేకులు జెప్పిన దానిఁ జేయింపు ముల్లోకులు మెచ్చ-
గా నీవనిన సుతుమాట లంకాజాని విని ప్రహస్తుఁడను మంత్రుల-
ఱేని జూచి పలికె వీఁడెవ్వఁడో తానిచ్చటికి వచ్చుటేమో క్రీడా-
కాననముఁ బెఱుకుటేమో సుభటులఁ జంపుటేమో యీ
వానరుని యడుగుమన నతడటులనే యడిగిన వనచర
నేను విడిపింతు నిన్ను భయము మాని నిజమాడు సభలో ననె ॥నారీమణీ॥
రావణా లోకత్రయవిద్రావణ వినరోరి సకల-
జీవహృదయస్థుఁడై మీఱి దేవదేవుఁడౌ శ్రీరామశౌరి పాద-
సేవకుఁడనురా సురారి మా రామావనీంద్రుని నారీమణిని
నీవు శునకము హవిస్సు గొనుగతి దెచ్చినావు ఇట్లా యేలరా చెడిపొ-
య్యేవు ఇంక నా బుద్ధివింటే బ్రతికేవు రఘుపతి ఋష్యమూకమున సు-
గ్రీవుఁడను కపిరాజుతోఁ జెలిమిచేసి యొకతూఁపున-
నే వాలిఁ జంపి కపులకుఁ బతిని జేసి రవిజుని కపిదేవుఁ
డవనిజను జూడ నంపఁగా వచ్చితినిఁ బవనజుఁడనె ॥నారీమణీ॥
కంటి రాతమ్మికంటి సీతను నేనీతోఁట గూల్చితి కొంటెచేష్టల కోఁతినౌట చంపెద
మంటవచ్చి చస్తే నే పూటా అన్నిటికంటె మై ప్రియమను మాట వినవే
వింటి నీ కొడుకు నన్ను సాధించెనంట పొంగినావు బ్రహ్మాస్త్రము
యొంటనంటి చనె నీకు ప్రియము జెప్పేనంట బంధునివలె దయచే వచ్చితి
కంటకపు మతి త్యజింపుము జగము గతి విచారింపుము
బంటకొను మెఱుక నది ముక్తిదము పౌలస్త్యకుల నీ-
వంటివాని కసురత్వము తనువాత్మగా నెన్నుటననె నతఁడు ॥నారీమణీ॥
మేనుకంటెను నేనన్యుఁడని యెంచితేని పరాపరమైన వస్తువౌదువు
గానీకరయఁ బ్రాణబుద్ధీంద్రియదుఃఖశ్రేణి లేదజ్ఞానమె మూలమని
దీని దెలిసితే నీకు మేలు కడలేని దీవి గతిగాను తనువు-
లో నీవున్నావంట యేను తన సంసృతిబంధమగునది
మాను చిన్మాత్రుఁడ నజుఁడ నక్షరుఁడ నేను ఆనందస్వభావుఁడ ననరా
మేను ప్రాణము మనసు మతి మొదలౌనివి భూమి మరుద-
హమిక ప్రకృతి వికారజాతములౌ నందెనయెడు నిరభి-
మాని నిరుపాధికుఁ డీశ్వరుఁడు తానని యెఱుంగ ఘనుడగు ననె ॥నారీమణీ॥
దశముఖ సావధానమతివై యొకటి వినరా ముక్తి
వెసనబ్బు హరిభక్తి గనరా దాన నిశితజ్ఞానము గల్గి మనరా జ్ఞానా-
భ్యసనమునను సోహమనరా దాననసమానభవము చేకొనరా యోరీ
దశరథాత్మజుఁడు ప్రకృతికంటెను పరుఁడు బిసరుహాక్షుఁడు విష్ణుఁడు శ్రీదేవి
వసుధాపుత్రి యా చెలి మున్నిడుకొని రత్నసమూహముతో వచ్చియిచ్చి శరణను
వెస నీవె యపరాధినను మతఁడు శరణాగత ప్రియుఁ
డొసఁగ భయము శేషగిరివిభుఁడు అని పవనసుతుఁ డమృ
తసమానముగఁ బల్కుపల్కుల కసురేంద్రుఁ డలిగి నలి రేగెను ॥నారీమణీ॥